Monday, July 28, 2025

జగన్‌కు బాబు సహకారం!

 జగన్‌కు బాబు సహకారం, చూస్తుంటే నిజమే అనిపిస్తుంది!

హూ కిల్డ్‌ బాబాయ్? ప్రతి ఎన్నికల సభలో చంద్రబాబు వేసిన ప్రశ్న ఇది. 
ఎన్నికలు జరిగి ఏడాది గడిచింది. హూ కిల్డ్‌ అనే సమాధానం చెప్పవలసిన ముఖ్యమంత్రి ఆ విషయమే మరిచిపోయాడు.

అవినాష్‌రెడ్డి అరెస్ట్‌కు సిబిఐ అధికారులు కర్నూలు వెళ్తే, మొత్తం పోలీసు యంత్రాంగం అడ్డం నిలబడింది. ఇదేమి అరాచకమని గోల చేశాడు చంద్రబాబు.
ఈ సంవత్సర కాలంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ అనే ప్రయత్నమే చేయలేదు.

స్మార్ట్‌ మీటర్‌ అంటే రైతు మెడకు ఉరితాడు అని ఉద్యమం చేసింది తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి రాగానే స్మార్ట్‌ మీటర్లు బిగించే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. కమ్యూనిస్టులు తప్ప మరొకరెవరూ పట్టించుకోవడం లేదు.

షిర్డి సాయి ఎలక్ట్రికల్‌ కంపెనీ విద్యుత్‌ శాఖను దోపిడీ చేస్తున్నదని, తెలంగాణాకు 80వేల రూపాయల ధరకు సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆంధ్రలో రెండు లక్షల రూపాయల ధరకు కొన్నారని తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున ఆందోళన చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో 2 వేల కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలు, అదే ధరలకు కొన్నది చంద్రబాబు ప్రభుత్వం.

మద్యం కుంభకోణంపై దర్యాప్తుకు ఫిబ్రవరిలో సిట్‌ నియమితమైంది. దానిలో కీలక పాత్ర అని జగమంతా తెలిసిన పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని ఇప్పుడు అరెస్ట్‌ చేశారు. ఈ ఆరు నెలల వ్యవధిలో ట్రైల్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయస్థానాలలో బెయిల్‌ కోసం ప్రయత్నం చేశాడు మిధున్‌రెడ్డి. ఎక్కడ ఉపశమనం దొరకని పరిస్థితిలో అరెస్ట్‌ జరిగింది.
మిధున్‌రెడ్డికి ఇంతకాలం అవకాశాలు ఇవ్వడం వెనుక రాజకీయ లాలూచీతనం లేదని భావించగలమా?

తాడేపల్లిలోని జగన్‌ ఇంటి ప్రహరీకి కోట్లు ఖర్చు పెట్టి కంచె వేశారు. మరికొన్ని కోట్ల రూపాయల విలువైన ఫర్నీచర్‌ కూడా వుంది. పాతిక లక్షల విలువ కూడా చేయని ఫర్నీచర్‌ తిరిగి ఇవ్వలేదని కోడెల శివప్రసాద్‌ మీద చోరీ కేసు పెట్టాడు జగన్‌. దానితోనే ఆయన ఆత్మ హత్య చేసుకొన్నాడు. కానీ కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని తన వద్దే పెట్టుకొన్న జగన్‌ జోలికి వెళ్లలేక పోతున్నాడు చంద్రబాబు.కనీసం ఆ వస్తువులు వెనక్కు తెప్పించలేదు. 

కరేడులో ఇండోసోల్‌ కంపెనీ జగన్‌ బినామీ అని, దానికి వేల ఎకరాల భూమి ఇవ్వడానికి లేదని ఎన్నికల ప్రచార సభలలో ఆవేశపూరితంగా మాట్లాడాడు చంద్రబాబు.
ఇప్పుడు జగన్‌ ఇస్తానన్న దానికి రెట్టింపుగా, 8వేల ఎకరాల భూమి ఇస్తున్నాడు. 

అప్పుడు, ఇప్పుడు కూడా అది జగన్‌ బినామీ కంపెనీ. ఇదేమి అన్యాయమని కొందరు మంత్రులు క్యాబినెట్‌ సమావేశంలో అభ్యంతరం చెప్తే, నోరు మూసుకోమని గద్దించాడు.

జగన్‌ హయాంలో విద్యుత్‌ శాఖ అధికారిగా వేల కోట్ల దోపిడీకి సహకరించిన ఐఎఎస్‌ అధికారికి ఛీఫ్‌ సెక్రటరీ ప్రమోషన్‌ ఇచ్చాడు చంద్రబాబు. చేసిన పాపాలన్నీ ఆ ఒక్క పదోన్నతితో తుడిచి పెట్టుకపోయాయి.
జగన్‌తో అంటకాగిన చాలామంది అధికారులు ఇప్పుడు చంద్రబాబు అంతరంగికులుగా మారారు. 

ఎన్నికల సమయంలో ఫోన్‌ చేసినా బదులు చెప్పలేదని మేఘా కృష్ణారెడ్డి మీద రుస రుస లాడాడు చంద్రబాబు. కానీ ఇప్పుడు అదే మేఘా కృష్ణారెడ్డి కోసం బనకచర్ల ప్రాజెక్ట్‌ ప్రతిపాదనను ఆచరణలో పెట్టడానికి ఢిల్లీకి వెళ్లి, ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇట్లా చెప్పుకొంటూ పోతే వంద ఉదాహరణలు కన్పిస్తున్నాయి. వీటి భావమేమి తిరుమలేశా? 

ప్రతి తెలుగుదేశం కార్యకర్త మనసును తొలుస్తున్న ప్రశ్న ఇది.


మద్యం కుంభకోణంపై దర్యాప్తు, వైకాపా నాయకులను వరసబెట్టి అరెస్ట్‌ చేయడం, జగన్‌ ఒక క్రిమినల్‌, జాగ్రత్తగా వుండాలని చంద్రబాబు తరచు చేస్తున్న ప్రకటనలు, ‘సాక్షి’ పత్రికలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు చూస్తే, రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న అభిప్రాయం ప్రజలలో వుంది. 

జగన్‌ను అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం కూడా జోరు నడుస్తూ వుంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన వందలాది కేసులు, అరెస్టులలో నేరుగా జగన్‌కు నొప్పి కల్గించే అంశం ఒక్క మద్యం కుంభకోణం మాత్రమే. 

తతిమావన్నీ ఆ పార్టీ నేతలు, వారితో అంట కాగిన అధికారులకు పరిమితం. ఎక్కడైతే జగన్‌ స్వయంగా బాధపడతాడో, అక్కడ ప్రభుత్వం చాలా మృదువుగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామాలలో దీన్ని విశ్లేషించినా అర్ధమయ్యే నిజమిది. 

మేఘా కృష్ణారెడ్డి, షిర్డి సాయి విశ్వేశ్వరరెడ్డి వంటి బడా సంపన్నులు అటు చంద్రబాబు, ఇటు జగన్ల మధ్య వారధి వలె పని చేస్తున్నారన్న అనుమానం సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఈ సంపన్నులు అప్పుడు జగన్‌ హయాంలో చేసిన దోపిడీల జోలికి చంద్రబాబు వెళ్లడం లేదు. 

పైగా ఇప్పుడు కూడా వారు రెట్టించిన ఉత్సాహంతో ప్రజాధనం పీల్చుకొని తినే అవకాశం కల్పిస్తున్నారు. దీని అర్ధం రేపు ఒకవేళ జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ దోపిడీ వూసెత్తడని. 

ఇతరత్రా ఎట్లా నడచుకొన్నా, కనీసం వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి వుంటే, ఇవన్నీ అపనిందలని కొట్టిపారేయడానికి ఆస్కారం వుండేది. 

 దానితోపాటు జగన్‌ ఏ కోర్టు విచారణకు హాజరు కాకున్నా, న్యాయశాఖ, పిపిలు మౌనంగా వుండిపోవడం అనుమానాలకు మరింత ఊతమిస్తున్నది. 

సిబిఐ కేసులు సరే, కోడి కత్తి శీను కేసుకు కూడా జగన్‌ హాజరు కావడం లేదు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అదేమని ప్రశ్నించడం లేదు.  

సాధారణ వ్యక్తులు ఒక వాయిదాకు రాకున్నా అరెస్ట్‌ వారెంట్‌ ఇచ్చే న్యాయస్థానాలు జగన్‌కు మాత్రం ఏళ్ల తరబడి మినహాయింపు ఇస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఈ దురన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం లేదు. దీని భావమేమి? 


చంద్రబాబు, జగన్‌లు పైకి మాత్రం బద్ధ శత్రువులుగా ప్రజలను నమ్మించే ప్రకటనలు చేస్తూ, అంతర్గతంగా ఒకరికొకరు సహకరించుకొనే వైఖరితో రాజకీయం చేస్తున్నారని ప్రజలు నమ్మడానికి చాలా ఆధారాలు కన్పిస్తున్నాయి...

పైన వ్రాత , జమీన్ రైతు పత్రిక  దోలేంద్ర ప్రసాద్ గారు. 

No comments:

Post a Comment