Sunday, April 19, 2020

మాతృభాష, మహిళలు, చట్టాలు, కోర్టులు, రాజ్యాంగం, రాజకీయాలు - కావేవీ కులజఫ్ఫాల కులపంచాయితీలకి అనర్హం

ఒక అడ్డగోలు ఉత్తర్వు తెచ్చేటప్పడు కొద్దిగ ఆలోచించండి, తల్లి తండ్రులు వాళ్లకు నచ్చినది ఎంచుకొనే అవకాశం ఇవ్వండి అంటే ఒక వర్గం అంటూ కమ్మల మీద దాడి చేసారు. ఆ ఉత్తర్వు చట్ట విరుద్దం అని కోర్టు కొట్టేస్తే కోర్టుకు వెళ్లింది ఇతను అనే నెపంతో ఇంకొక వర్గం అంటూ  బ్రాహ్మణుల  మీద దాడి చేసారు. అసలేంటి వీళ్ల కుల ఆధిపత్యపు ప్రకోపాలు?

మెుదటగా చెప్పుకోవలిసింది ఈ భూమి మీద ఏ సమూహం కూడా తమ భాషను పోగొట్టుకోవాలని కోరుకోదు, చివరికి లిపి లేని భాషల సమూహాలతో సహా. ఆ సమూహాల ఉనికి వాటి మాతృభాషతో అంతగా పెనవేసుకుని ఉంటుంది. దురదృష్టవశాత్తు తెలుగు నేల మీద ఆ సృహ తక్కువైతే దానికి పరాకాష్ట ఇప్పటి ప్రభుత్వ నిర్ణయం. అది దీర్ఘకాలంలో మన ఉనికికే ముప్పు అని నాలుగు మంచి మాటలు చెప్పిన వారందరినీ కులం పేరుతో తిట్టి వాళ్ల కుటుంబాలను వీదికి తెచ్చారు చట్టసభ సాక్షిగా. చివరికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారిని సైతం వదలలేనంత కుల అసహనం చూపించారు.

దీనిలో మంచి, చెడు పక్కన పెడితే ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం, దానిని కొంతమంది వ్యక్తులు తమ పార్టీ తరపున, మరి కొంతమంది వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఇక్కడ చెప్పుకోవలిసిన మరొక విషయం ఇదేమీ ఆస్తి తగాదాల సివిల్ కేసు కాదు, మన తాతల కాలం నుంచి చేయితిరిగిన హత్యల వంటి క్రిమినల్ కేసూ కాదు, కేవలం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసిన ఒక ప్రజా  ప్రయోజన  వాజ్యం. దీనిలో అధికారులను బెదిరించో, ప్రలోభ పెట్టో సాక్ష్యాలు తారుమారు చేయలేరు, లేక దస్తావేజులు మార్చలేరు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వు చట్టానికి అనుగుణంగా ఉందా, రాజ్యాంగానికి లోబడి ఉందా అనేదాని మీద తీర్పు ఉంటుంది. కోర్టు ఆ ఉత్తర్వు రాజ్యాంగానికి విరుద్దం అని కొట్టి వేస్తే దానికి ఈ పార్టీ సోషల్ మీడియాలో న్యాయమూర్తుల శీల హననం.

కేసు దాఖలు చేసిన వ్యక్తి ఇంట్లో ఆడవారితో సహా ఫోటోలు పెట్టి అసభ్య రాతలు, ఆ వ్యక్తి కులాన్ని లాగి ఇదంతా ఆ కులం కుట్ర అని  దూషించడం. ఎందుకు ప్రతి దానిలో కులాన్ని మాత్రమే వెతికే  కుల తీట? కేసు వేసిన వ్యక్తి ఆ కులానికేమీ ప్రతినిధి కాదు, ఆ కులమంతా గూడుపుఠాణీ చేసి ఈయనతో కేసు వేయుంచలేదు. ఇది ఆ కులం కుట్ర అయితే మీ పార్టీలో ఉన్న ఆ కులానికి చెందిన బాపట్ల నాయకుడు, విశాఖ నాయకుడు, మీ నాయకుడి కోసం దేవుడిని కూడా వదిలేసి పూజలు చేసే విశాఖ స్వామిలోరు, మీ పార్టీ కోసం పనిచేసే తిరుమల స్వామిలోరు, మాజీ సివిల్ సర్వీస్ అయ్యోరు మెుదలైన వారంతా ఈ కుట్రలో భాగమేనా? మీ నాయకుడి అనుమతి లేకుండానే ఈ కుట్రలో భాగమయ్యారా?

ఒక వ్యక్తి ఒక నమ్మకంతో కేసు వేయడం అతని వ్యక్తిగతం, పార్టీ తరుపున చేయడం పార్టీ సిద్ధాంతం. దానికి ఆ వ్యక్తి కుటుంబం, కులం ఏవిధంగా బాద్యత వహిస్తాయ? అలా అయితే మీరు సోషల్ మీడియాలో రాసే రోత రాతలు, లేకి కూతలు మీ కుల సిద్దాంతంగా భావించాలా? మీనాయకుడి కులం చేస్తున్న కుట్ర అనుకోవాలా? నిజానికి అలా అనుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది మహిళలు మీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు, మీ పార్టీ నాయకుడి కులానికి చెందిన వారికి  ఇప్పటికి కనీసం 500 పైగా  పదవులూ కట్టబెట్టారు. మీ సోషల్ మీడియా ఫాక్షనిజం ఈ సరికే మీ పార్టీ, కుల పెద్దల దృష్టికి వచ్చి ఉంటుంది, కానీ ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు, మహిళల మీద, కులాల మీద సోషల్ మీడియా ఫాక్షనిజం ఆగలేదు అంటే ఇది తప్పక మీ పార్టీ లేక పార్టీ పెద్దల కుల కుట్రగానే భావించాల్సి ఉంటుంది.

స్వాతంత్రము  వచ్చిన  సమయంలో తెలుగు రాజకీయాలను నిర్ణయించిన  బ్రాహ్మణులను రాజకీయ పాలెగాళ్లు ఏవిధంగా అణగదొక్కి తమ కులజెండాలెగరేసారో కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ జరుగుతుంది మళ్లీ దాదాపు అదే. మా ఖాప్ లకు(కుల పంచాయతీలు) అడ్డొస్తే, వ్యవస్ధలు, చట్టాలు, కోర్టులు, రాజ్యాంగం ఏదీ వదలం అనే పాలెగాళ్ల కాలపు మనస్ధత్వం మాత్రమే!




NOTE: ఈ ప్రక్కన ఫోటో పెట్టి వై.చి.పి. సోషల్ మీడియా తిప్పుతున్న మెసేజ్, నేను వారి కుటుంబసభ్యుల ముఖాలను కవర్ చేయటానికి ప్రయత్నించాను,  సుధీష్ ఎటూ పబ్లిక్ ఫిగరే. 

No comments:

Post a Comment